SC Judges: ఆస్తుల్ని బహిర్గతపరిచేందుకు న్యాయమూర్తులంతా ఏకగ్రీవ..! 3 d ago

భారత ప్రధాన న్యాయమూర్తితో కలిసి సుప్రీంకోర్టు న్యాయమూర్తులంతా సంచలన నిర్ణయం తీసుకున్నారు. తమ ఆస్తులను ప్రకటించడానికి ఏకగ్రీవంగా అంగీకారం తెలియజేశారు. వీటి ద్వారా జడ్జీలు ఆస్తులు వెల్లడించాల్సిందేనని వారు సంతకాలు చేశారు. న్యాయ వ్యవస్థపై విశ్వాసం కలిగించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. త్వరలో ఈ వివరాలను సుప్రీం కోర్టు ప్రత్యక వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచనున్నారు.
ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా పని చేసే జస్టిస్ యశ్వంత్ వర్మ అధికారిక బంగ్లాలో నోట్ల కట్టలు బయటపడిన విషయం విదితమే. ఈ సంగతి దేశవ్యాప్తంగా.. తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారానికి సంబంధించిన ఇటు ప్రత్యేక కమిటీ విచారణ కొనసాగుతుండగా.. అటు ఆ వివరాలను సర్వోన్నత న్యాయస్థానం వెబ్ సైట్ లో ఉంచి అందరిని ఆశ్చర్యపరిచింది.
ఈ సందర్భంలో ఏప్రిల్ 1వ తేదీన సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలో న్యాయమూర్తులంతా ప్రత్యేక సమీక్షా నిర్వహించారు. తమ ఆస్తుల్ని బహిర్గతపరిచేందుకు న్యాయమూర్తులంతా కలిసి ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు ఉన్న నిబంధనల ప్రకారం.. విధులు స్వీకరించే సమయంలో తమ ఆస్తుల వివరాలను న్యాయమూర్తులు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకు తెలియజేశారు. అనంతరం సుప్రీం కోర్టు ఆ వివరాలను తమ వెబ్ సైట్ లో అప్లోడ్ చేస్తూ వచ్చింది. కొంత మంది న్యాయమూర్తుల ఆస్తుల వివరాలను ఆ వెబ్ సైట్ లో ఉంచ్చింది. కాగా, గత కొన్ని సంవత్సరాలుగా న్యాయమూర్తుల ఆస్తుల వివరాలేవీ అప్డేట్ కావడం లేదు. అందుకు కారణం.. ఆ వివరాలను తప్పనిసరిగా ప్రజలకు బహిర్గత పర్చాలనే నిబంధనేదీ లేకపోవడమే. ఈ నేపథ్యంలో ఇప్పుడు జస్టిస్ వర్మ వ్యవహారం చర్చనీయాంశం కావడంతో.. తమ ఆస్తుల్ని బహిర్గత పర్చాలని సుప్రీం కోర్టు న్యాయమూర్తులంతా నిర్ణయించడంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.